కృష్ణ శతకము
శ్రీ రుక్మిణీశ, కేశవ,
నారద సంగీతలోల, నగధర శౌరీ,
ద్వారకనిలయ జనార్దన,
కారుణ్యముతోడు మమ్ము గావుము కృష్ణా !
నీవే తల్లివి తండ్రివి,
నీవే నా తోడు నీడ, నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు, నిజముగ కృష్ణా !
నారాయణ పరమేశ్వర,
ధారాధర నీలదేహ, దానవవైరీ,
క్షీరాబ్ధిశయన, యదుకుల
వీరా, నను గావు కరుణ వెలయగ కృష్ణా!
హరియను రెండక్షరములు
హరియించును పాతకములు నంబుజనాభా!
హరి నీ నామ మహత్త్వము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
క్రూరాత్ముడజామీళుడు
నారాయణ యనుచు ఆత్మనందను పిలువన్,
ఏరీతి నేలుకొంటివి!
ఏరీ నీ సాటివేల్పు లెందును కృష్ణా!
అక్రూర వరద, మాధవ,
చక్రాయుధ, ఖడ్గపాణి, శౌరి, ముకుందా,
శక్రాది దివిజసన్నుత,
శుక్రార్చిత, నన్ను గరుణ జూడుము కృష్ణా!
నందుని ముద్దులపట్టివి,
మందరగిరిధరుని, హరిని, మాధవ విష్ణున్,
సుందర రూపుని మునిగణ
వందితు నిను దలతు భక్తవత్సల కృష్ణా!
ఓ కారుణ్య పయోనిధి,
నాకాధారంబవగుచు నయముగ బ్రోవన్,
నాకేల ఇతర చింతలు,
నాకాధిప వినుత లోకనాయక కృష్ణా!
వేదంబులు గననేరని
ఆది పరబ్రహ్మమూర్తి, అనఘ మురారీ!
నాదిక్కు జూచి గావుము,
నీదిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణా!